పిల్లలను స్కూల్‌కి పంపితేనే ‘అమ్మ ఒడి’ .. తేల్చేసిన మంత్రి బొత్స

By Siva KodatiFirst Published Jun 23, 2022, 5:44 PM IST
Highlights

అమ్మఒడి పథకం నుంచి వేలాది మంది లబ్ధిదారులను కట్ చేసినట్లుగా విపక్షాలు చేస్తున్న విమర్శలు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. పిల్లలను స్కూల్‌కు పంపితేనే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

అమ్మఒడి పథకం (amma vodi) లబ్ధిదారులను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు చేస్తోన్న విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబ్ధిదారుల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు ఆధారంగానే లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి అన్నారు. అమ్మఒడి డబ్బులలో రెండు వేల రూపాయల కోతను పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఇంటర్ ఫలితాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని సత్యనారాయణ ఆయన పేర్కొన్నారు.

కాగా.. జగన్ సర్కారు (ys jagan govt) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే. విద్యార్థులను బడి బాటపట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద ప్రభుత్వం.. తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేలు జమ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను అమ్మ ఒడి నిధులను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా అమ్మఒడి మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే పాఠశాలలకు వెళ్లకపోవడంతో.. హాజరు ఆధారంగా 51 వేల మందిని అమ్మఒడికి అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మరో 50 వేల మందికి ఈ పథకాన్ని నిలిపేసింది. 

అంతేకాదు.. కరెంట్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటిన వారికి.. 75 శాతం హాజరు లేకపోయినా అమ్మఒడికి అనర్హులని విద్యాశాఖ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కొత్తది ఉండాలని.. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలని సూచించింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవాలని.. అకౌంట్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. అంతేకాదు ఈ ఏడాది అమ్మఒడి కింద రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ స్పందించారు. 

click me!