అసంతృప్తులు, అపోహలు తొలగించేలా.. పాజిటివ్ వాతావరణంలోనే చర్చలు... మంత్రి బొత్స (వీడియో)

By SumaBala Bukka  |  First Published Feb 5, 2022, 12:55 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యోగుల నిరసన నేపథ్యంలో మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతంగా జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాజిటివ్ వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 


అమరావతి : అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించామని, అసంతృప్తులు, అపోహలు తొలగించేలా చర్చలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆర్ధిక పరమైన అంశలు మేము చర్చించుకుని.. మధ్యాహ్నం ఉద్యోగులతో చర్చిస్తాం అని ఆయన అన్నారు. 

"

Latest Videos

పాజిటివ్ వాతావరణం లో చర్చలు జరుగుతున్నాయి. పిట్ మెంట్ అంశం అయిపోయింది. అందులో మార్పు ఉండదు. HRA, రికవరీ అంశాలపైనే ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. మిగిలినవన్నీ చిన్న చిన్నవే అని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలు సీఎం దృష్టికి  తీసుకు వెళతామన్నారు. రికవరి లేకపోతే ఆర్ధిక భారం 5 నుంచి 6వేల కోట్లు ఆర్ధిక భారం అవుతుందన్నారు.

హెచ్ ఆర్ ఏ తో పాటు ఇతర అంశాలు చర్చిస్తామన్నారు. ఐఆర్, రికవరీనే  ప్రధాన అంశం అని దీనిపైనే ప్రధానంగా చర్చ జరగాలి అన్నారు. హెచ్ఆర్ఏ విషయంలో ఇంకొంత స్పష్టత  రావాలన్నారు. దీనిమీద సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది. 

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌తో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న మంత్రుల కమిటీ భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరించనుంది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ‌లతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు.  

ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పీఆర్సీ సాధన సమితి నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది.  ఇక, శనివారం ఉదయం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు నుంచి ఉద్యోగులకు మేలు చేయాలనే చెబుతున్నారని తెలిపారు. అందుకే మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు. నిన్న రాత్రి ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఉద్యోగులకు నష్టం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించదని చెప్పారు. హెఆర్‌ఏ సహా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. 

ఈరోజు జరిగే చర్చలు ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నట్టుగా మంత్రి పేర్ని నాని చెప్పారు. చర్చల తర్వాత ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. నిన్నటి చర్చల్లో అనేక అంశాలపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని అన్నారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అవుతామని వెల్లడించారు. షరతులతో చర్చలు జరగవని.. సమస్య పరిష్కారం కాదని అన్నారు.

click me!