సీఎం జగన్‌తో బొత్స భేటీ.. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక చర్చ..

By Sumanth KanukulaFirst Published Mar 3, 2022, 3:48 PM IST
Highlights

రాజధాని అంశంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యతు కార్యచరణకు సంబంధించి ఈ భేటీలో చర్చిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యతు కార్యచరణకు సంబంధించి ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ భేటీ తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ విధానాన్ని ఆయన స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ..  మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని.. సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఉన్నదే చట్టాలు చేయడానికని చెప్పారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తెలిపారు. శాసససభలో చట్టాలు చేయకుడదంటే ఎలా అని ప్రశ్నించారు.  తమ ప్రభుత్వం విధానం మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. 

Latest Videos


ఇక, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై తీర్పు వెలురించిన హైకోర్టు.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ది పనులపై హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని పేర్కొంది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమిని వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

కొందరు న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని తెలిపింది. మాస్టర్ ప్లాన్ ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

click me!