ఏపీలో వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
అమరావతి : వినాయక చవితి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని, సామూహికంగా వద్దని మాత్రమే చెప్పామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఉన్న 36 పర్యాటక శాఖ హోటళ్లను పూర్తిగా ఆధునీకరిస్తామని ప్రకటించారు.
హరిత హోటళ్లను బ్రాండింగ్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్యలంక, గండికోటతో పాటు 13 చోట్ల 5 స్టార్ హోటళ్ల నరి్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే పాఠశాలలకు అవార్డులు ఇస్తామని, కొత్త క్రీడా విధానం దసరానాటికి తీసుకువస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.
కాగా, ఏపీలో వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిల నేతృత్వంలో బీజేపీ శ్రేణులు నేడు కర్నూలులో ఆందోళన చేపట్టాయి.
వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అనంతరం సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
అంతకుముందు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వినాయకచవితి పండుగ విషయంలో ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలు హిందూవుల పండుగలకేనా అని ఆయన ప్రశ్నించారు. ఇతర మతాల పండుగలకు ఈ ఆంక్షలు వర్తించవా అని సోమువీర్రాజు అడిగారు.
వినాయక విగ్రహలు బయట ఏర్పాటు చేస్తే అరెస్ట్ చేస్తామని డీజీపీ ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. రంజాన్, క్రిస్మస్, మొహర్రం పండుగలపై లేని ఆంక్షలు వినాయకచవితికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.