పులివెందుల నుండి మనుషులను రప్పించి దాడి చేయించినట్టు నిరూపిస్తే రాజీకయాల నుండి తప్పుకొంటానని మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
విశాఖపట్టణం: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై పులివెందుల నుండి మనుషులను రప్పించి దాడి చేయించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడి నుండో మనుషులను రప్పించాల్సిన అవసరం తమకు లేదన్నారు. పులివెందుల నుండి మనుషులను రప్పించినట్టుగా నిరూపించాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈ విషయమై నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బాబుకు స్పష్టం చేశారు.
Also read:విశాఖలో బాబు వెనక్కి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించింనందుకు చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలే అడ్డుకొన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడున విశాఖ ఎయిర్ పోర్టులోనే వైసీపీ శ్రేణులు గురువారం నాడు నిలువరించారు. నాలుగు గంటలకు పైగా ఆయన కారులోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే ఉన్చ చంద్రబాబును గురువారం నాడు రాత్రి ఏడున్నర గంటల సమయంలో విశాఖపట్టణం పోలీసులు హైద్రాబాద్ కు పంపారు. విశాఖలో తన పర్యటనను అడ్డుకోవడంపై చంద్రబాబునాయుడు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.