
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నయ్యగారు అంటూ సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడతానని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పోలవరంపై అన్ని వివరాలు ప్రజల ముందు వుంచామన్నారు. నాడు-నేడుతో అప్పుడు, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా వుందో చూపించామని అంబటి పేర్కొన్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని రాంబాబు ప్రశ్నించారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేయడంలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారని ఆయన నిలదీశారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకపోవడం అశాస్త్రీయం కాదా అని దుయ్యబట్టారు. చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. రూ . వేల కోట్లు నొక్కేసేందుకే మోడీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారని రాంబాబు ఆరోపించారు.
ALso Read: జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు .. గిల్లినప్పుడు, గిల్లించుకోవాల్సిందే : చిరంజీవికి పేర్ని నాని కౌంటర్
అంతకుముందు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా మంత్రి తీవ్రవ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును రౌడీషీటర్‌గా ప్రకటించాలని.. అసలు ఆ రోజు మా పార్టీ నేతలే లేరని ఆయన పేర్కొన్నారు. కావాలని రెచ్చగొట్టి.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
ఘటనాస్థలిలో ఎవరైనా చనిపోతే దాన్ని వివాదంగా మార్చాలని చూశారని ఆయన మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని గుడివాడ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేసిన స్కెచ్‌లో ఇది భాగమేనని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా చేశారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఆయన భద్రత విషయంలో ఏదైనా జరిగితే తమ ప్రభుత్వంపై నింద వేస్తారని భయంగా వుందన్నారు. చంద్రబాబు ఎంత కాలం వుంటే మా పార్టీకి అంత మంచిదని అమర్‌నాథ్ పేర్కొన్నారు.