
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. పోలవరంపై నాదెండ్ల మనోహర్ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ పార్టీ పెట్టారా అని మంత్రి ప్రశ్నించారు. పోలవరంపై అవాకులు చవాకులు పేలుతున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు అస్తవ్యస్తం చేశారని.. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు.
పోలవరం నిర్మాణం ఆలస్యం అవ్వడానికి టీడీపీ తొందరపాటు చర్యలే కారణమని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బీజేపీతో త్వరలోనే పవన్ విడాకులు తీసుకుంటారని.. చంద్రబాబుని పెళ్లి చేసుకుంటారని మంత్రి జోస్యం చెప్పారు. రాత్రి ఏడు గంటలకు పోలవరం వెళ్తానని చంద్రబాబు మొండిపట్టు పట్టారని.. గొడవ చేయడానికి అక్కడికి వెళ్లారని రాంబాబు ఆరోపించారు. పవన్, మనోహర్ ను నేనే తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం, పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రమే భరిస్తుందని.. అలాంటిది పోలవరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం చారిత్రాత్మక తప్పిదమని రాంబాబు మండిపడ్డారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయా ఫ్రమ్‌వాల్ పూర్తి చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. రూ 2000 కోట్లను గంగలో కలిపేశారని రాంబాబు దుయ్యబట్టారు.
Also Read: స్వర్ణాంధ్ర కాస్త గంజాయి, అప్పుల ఆంధ్ర... జగన్ కు బంగాళఖాతమే దిక్కు :దేవినేని ఉమ (వీడియో)
అంతకుముందు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు పాలనలో హరిత, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వెలుగొందిన రాష్ట్ర జగన్ రెడ్డి పాలన వుందన్నారు. ఈ నాలుగేళ్ళ దుష్ట , రాక్షస పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. అన్ని రంగాలు, వ్యవస్థలకు నిర్వీర్యం చేశాడని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల అణచివేతకు వైసిపి ప్రభుత్వం పూనుకుందని... ఆయా వర్గాలపై అక్రమ కేసులు బనాయింపు అందుకోసమేనని దేవినేని ఉమ అన్నారు.
ముఖ్యంగా దళిత వర్గానికి చెందినవారు జగన్ పాలనతో తీవ్ర అణచివేతకు గురయ్యారని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ జగన్ రెడ్డి విధ్వంసానికి పాల్పడ్డాడని ఉమ ఆరోపించారు. వైసిపి దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు, గౌరవ సభలను చంద్రబాబు నాయుడు రూపొందించారని అన్నారు. వీటి ద్వారా టిడిపి నాయకులంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారని అన్నారు. ఇక మొద్దు నిద్రలో వున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా స్వయంగా చంద్రబాబే 'బాదుడే - బాదుడు' కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఉమ గుర్తుచేసారు.