
ఏపీలోని అతిపెద్ద నగరం, దేశంలోని కీలక నగరం విశాఖ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అమరావతిలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని నగరాలతో పోటీపడగల నగరం విశాఖ అన్నారు. విశాఖలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని.. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని విశాఖపై దాడి చేశారని అంబటి ఆరోపించారు. అమరావతి పాదయాత్ర పేరుతో రెచ్చగొడుతున్నారని.. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అంబటి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు విశాఖ గర్జనకు తరలివచ్చారని.. చంద్రబాబుకు పవన్ 3 రోజుల కాల్‌షీట్ ఇచ్చారని రాంబాబు మండిపడ్డారు.
కాల్‌షీట్‌లో భాగంగానే విశాఖలో అలజడి సృష్టించారని.. రాష్ట్ర మంత్రులపై దాడులు చేయించారని అంబటి ఆరోపించారు. దాడులు చేస్తే అరెస్ట్ చేయకుండా సన్మానాలు చేయాలా అని మంత్రి ప్రశ్నించారు. హింసను ప్రోత్సహిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని రాంబాబు నిలదీశారు. చంద్రబాబుకు పవన్ బానిసగా పనిచేస్తున్నారని.. అది జనసేన కాదని, బాబుసేనంటూ మంత్రి సెటైర్లు వేశారు. ఎవరు ఎంతగా అడ్డుకున్నా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఉత్తరాంధ్రకు వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు వాణి వినిపించేందుకే పవన్ విశాఖ వచ్చారని అంబటి రాంబాబు ఆరోపించారు. హింసను ప్రోత్సహించిన ఏ పార్టీ కూడా బాగుపడలేదని.. ఎవరినీ బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Also Read:నేరస్తుడికి అధికారమిస్తే ఇలానే ఉంటుంది: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్
అంతకుముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విమర్శించారు. విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను విశాఖపట్టణానికి రాకముందే గొడవ జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు..ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గొంతెతొద్దు, ప్రశ్నించొద్దంటే ఎలా అని ఆయన అడిగారు. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారం చేస్తున్నారని జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బలహీనుల విషయంలో పోలీస్ శాఖ బలంగా పనిచేస్తుందన్నారు. ఎదురు దాడి చేసేవారి విషయంలో చాలా బలహీనంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని డ్రోన్లను నిషేధించారన్నారు. రాజకీయాల్లో నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.