
పోలవరం పనుల పురోగతిని పరిశీలించామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందన్నారు. పోలవరం పురోగతి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని.. సోమవారం పోలవరమంటూ చంద్రబాబు ప్రచారానికే పరిమితమయ్యారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ తప్పిదంతో రూ.2,200 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.
ఇంతటి నష్టం జరిగితే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదని రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం కడుతుందంటూ గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని అంబటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్ చొరవతోనే నిధుల కొరత సమస్యల తీరిందని.. పోలవరం చూస్తామంటూ టీడీపీ నేతలు హంగామా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పోలవరం చూస్తామంటూ టీడీపీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది టీడీపీయేనన్న ఆయన.. పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని అంబటి దుయ్యబట్టారు.
Also Read: ఆ పన్నాగం పసిగట్టి కేసీఆర్ పక్కన పెట్టాడు: హరీష్ రావుకు పేర్ని నాని కౌంటర్
కడుపుమంటతోనే ఎల్లో మీడియా పోలవరంపై దుష్ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బుర్ర సరిగా పనిచేయడం లేదని.. కుప్పం, చంద్రగిరిని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని రాంబాబు ప్రశ్నించారు. కుప్పాన్ని కనీసం మున్సిపాలిటీగా కూడా చేయని వ్యక్తి చంద్రబాబని అంబటి ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాంబాబు చురకలంటించారు. పులివెందులను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దిన వ్యక్తి వైఎస్సార్ అని మంత్రి ప్రశంసించారు. సొంత రాష్ట్రంలో చంద్రబాబు కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని.. ఆయనకు ఏపీపై ప్రేమే లేదన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని రాంబాబు హితవు పలికారు. పోలవరం అంచనా వ్యయంలో భూసేకరణ, పునరావాసానికే రూ.33 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంబటి తెలిపారు.