ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అటెండర్ కి కరోనా

By telugu news teamFirst Published Apr 29, 2020, 9:26 AM IST
Highlights

మంగళవారం అర్థరాత్రి చేసిన పరీక్షల్లో వారందరికీ మాత్రం నెగిటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. 12వందల కేసులకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా.. తాజాగా.. ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్ కు కరోనా సోకింది.

మంగళవారం అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. తుది నిర్థారణకు నమూనాలను వైరాలజీ ల్యాబ్ కి పంపారు. అటెండర్ ని పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాలకు తరలించారు.  విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి ఆళ్ల నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీ లోని మిగతా అధికారులు, ఉద్యోగులు మొత్తం కలిపి 12మందికి పరీక్షలు చేశారు.

మంగళవారం అర్థరాత్రి చేసిన పరీక్షల్లో వారందరికీ మాత్రం నెగిటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.

ఇదిలా ఉండగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1250 దాటింది.  వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు.

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. 

కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.

click me!