ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ చిరంజీవి భేటీ ప్రధాన్యత సంతరించుకొంది. రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టారా అనే చర్చ సాగుతోంది.
ఈ నెల 14వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సినీ నటుడు చిరంజీవి భేటీ అయ్యారు. సైరా సినిమా చూడాలని సీఎం జగన్ దంపతులను చిరంజీవి దంపతులు ఆహ్వానించారు.
undefined
సుమారు గంట పాటు వీరిద్దరి మధ్య చర్చ సాగింది. అయితే రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చిరంజీవి ప్రకటించారు.
చిరంజీవి దంపతులను జగన్ దంపతులు ఆప్యాయంగా ఆహ్వానించారు.
పరస్పరం ఇద్దరు ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడుకొన్నారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తూ సైరా సినిమా గురించి మాట్లాడుకొన్నారు. సైరా సినిమా చిత్రీకరణతో పాటు ఇతర విషయాలను చర్చించుకొన్నారు.
రెండు మూడు రోజుల్లో సైరా సినిమాను సీఎం జగన్ దంపతులు చూసే అవకాశం ఉంది. చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం వెనుక రాజకీయంగా కూడ జనసేనకు చెక్ పెట్టే వ్యూహం ఉండి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడ రాజకీయవర్గాల్లో విన్పిస్తున్నాయి.
2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చిరంజీవి సోదరుడు నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. టీడీపీకి జనసేన రహస్య మిత్రుడే అంటూ వైసీపీ విమర్శలను గుప్పించింది. ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
ఈ తరుణంలోనే సైరా సినిమా చూడాలని సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి కలిశారు. చిరంజీవి, జగన్ గంటపాటు భేటీ కావడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపనుంది. ఎన్నికలకు ముందు కూడ వైసీపీ కాపు నాయకులను తమ పార్టీలో చేర్చుకొనే ప్రయత్నం చేసింది. ఎన్నికల తర్వాత కూడ కాపు నాయకులను తిరిగి తమ పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతోంది.
జగన్ చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా జనసేనపై రాజకీయంగా దెబ్బకొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ భావించి ఉంటుందని ఈ క్రమంలోనే చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత లేదని చిరంజీవితో పాటు వైసీపీ వర్గాలు ప్రకటించాయి.
కానీ, రాజకీయంగా వీరిద్దరి భేటీ ప్రభావం తప్పకుండా చూపే అవకాశం ఉంటుందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా జనసేనకు చెక్ పెట్టే అవకాశం ఉందని వైసీపీ చీప్ భావించి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టిని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ ఉంది. దీనికి తోడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొంటే రాజకీయంగా బలపడేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కూడ పవన్ కళ్యాన్ వైపు సమీకరించబడితే రాజకీయంగా వైసీపీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చిరంజీవికి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చి ఉంటారనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో నెలకొన్నాయి.
తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఈ భేటీ తర్వాత చిరంజీవి ప్రకటించారు. జగన్ తనను ఆప్యాయంగా ఆహ్వానించారని ఆయన ప్రకటించారు. సైరా సినిమా గురించే తమ మధ్య చర్చ జరిగిందని చిరంజీవి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు:
జగన్-చిరు భేటీ: ప్రధాన చర్చ దీనిమీదేనా..?