గడువులోగా పోలవరం పూర్తి కాదు

First Published Nov 17, 2017, 9:25 AM IST
Highlights
  • పోలవరం పనులకు సంబంధించి కేంద్ర కమిటీ చంద్రబాబునాయుడు గాలి తీసేసింది.

పోలవరం పనులకు సంబంధించి కేంద్ర కమిటీ చంద్రబాబునాయుడు గాలి తీసేసింది. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చంద్రబాబు మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. చంద్రబాబు చెబుతున్నట్లు గడువులోగా ప్రాజెక్టు పూర్తి కాదన్న విషయం కమిటీ నివేదికతో స్పష్టమైపోయింది.

గడువులోగా పోలవరం పనులు పూర్తి కావన్న విషయం తేలిపోయింది. కేంద్రం తరపున మొన్నటి ఏప్రిల్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మసూద్ అహ్మద్ కమిటి తన నివేదికలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కమిటీ కేంద్రానికి అందచేసిన నివేదికలోని అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రాజెక్టు పనులు లక్ష్యాలు పూర్తయ్యే దిశగా సాగటం లేదని కమిటి అభిప్రాయపడింది. ఎడమ కాలువ పనులు పూర్తవ్వాలంటే ఎన్నో సవాళ్ళున్నట్లు కమిటి చెప్పింది. ఎడమ కాలువలో 2018 మార్చి నాటికి 349 కట్టడాలు పూర్తవ్వాలన్నది లక్ష్యం  ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రకారమైతే లక్ష్యాలు చేరుకోవటమన్నది సాధ్యం కాదని కమిటి స్పష్టంగా పేర్కొంది. నెలకు ఎన్నికట్టడాలు కట్టాలన్న విషయం అగ్రిమెంటులో స్పష్టంగా ఉన్నప్పటికీ మార్చి, ఏప్రిల్లో ఒక్క కట్టడమూ పూర్తి కాలేదట.

ఎడమ కాలువ పనులు పూర్తవ్వాలంటే రైల్వే లైనును, అనేక వాగులను, చిన్న నదిను దాటి కాలువ నిర్మించాలట. 10 చోట్ల జాతీయ రహదారిని, రెండు చోట్ల రైల్వే లైన్లను దాటే చోటే రైల్వే అధికారులకు ప్రతిపాదనలు ఇంత వరకూ కేంద్రానికి పంపలేదట. ఈ రైల్వే పనులు కూడా హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గంలో ఉందట.

ఇక, కుడి కాలువ గురించి మాట్లాడుతూ, కాలువ లైనింగ్ పనుల్లో అక్కడక్కడ బంకమట్టి కనిపించిందట. కాలువ లైనింగ్ పనులు పూర్తి కావాలంటే కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం లేదా ఇతర పరిశోధన సంస్ధల్లో పరీక్షించి ఆమోదించిన తర్వాత మాత్రమే మెటీరియల్ వాడాలట. కానీ నిబంధనలు ఏవీ పాటించకుండానే కాంట్రాక్టు సంస్ధ బంకమట్టిని వాడేస్తోందని ఆక్షేపించింది.  

పైగా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర జలసంఘం ప్రాంతీయ కార్యాలయం, కృష్ణా-గోదావరి బేసిన కార్యాలయం ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ విషయంలో ఎటువంటి పాత్ర పోషించటం లేదని కూడా స్పష్టం చేసింది. భూసేకరణ, పునరావాసం ఈ డాదిలో ఏ మేరకు పూర్తవుతుందన్న ప్రణాళికను కూడా రాష్ట్రం అందుబాటులో ఉంచలేదట. మొత్తం మీద కేంద్ర కమిటీ తేల్చిందేమంటే, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు అథారిటీ పాత్రను పునర్ నిర్వచించాలని. కమిటి నివేదిక ప్రకారమైతే 2019లోగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు.

click me!