పదిసార్లు నరికి, కసి తీరక సజీవ దహనం: వివాహిత దారుణహత్య

By Siva KodatiFirst Published May 30, 2019, 4:36 PM IST
Highlights

నెల్లూరులో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పది సార్లు నరికినా కసి తీరకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

నెల్లూరులో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పది సార్లు నరికినా కసి తీరకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నీలగిరి సంఘానికి చెందిన బీ.నిర్మలాబాయ్‌కి 23 ఏళ్ల కిందట రమేశ్ సింగ్‌తో వివాహం జరిగింది.

వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట రమేశ్ సింగ్ మరణించాడు. అప్పటి నుంచి ఆమె బీవీ నగర్‌లోని బంధువుల ఇంట్లో వుంటూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతోంది. 45 రోజుల కిందట ఆమె బీవీనగర్‌ నుంచి రామలింగాపురం సాయి లాడ్జి సమీపంలో ఉన్న ఇంట్లో అద్దెకు దిగింది.

తాను పనిచేస్తున్న పాఠశాలకు ఇళ్లు దగ్గరగా ఉండటంతో ఆమె ప్రతీ రోజు నడుచుకుంటూ వెళ్లి విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మంగళవారం పని వుందని ముందుగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లింది.

రాత్రి 7.40 నిమిషాల సమయంలో ఆమె ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి చేరుకున్నారు.

మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. వారికి నిర్మలా బాయ్ మృతదేహం కాలుతూ కనిపించడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.

మొదట అగ్నిప్రమాదం కారణంగా నిర్మలాబాయ్ మరణించి వుండవచ్చని భావించినప్పటికీ.. ఆమె మెడపై విచక్షణారహితంగా కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు.

ఈ హత్యపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మలాబాయ్ రోజు పాఠశాలకు వచ్చే సమయం కంటే ముందుగా ఇంటికి రావడంపైనే ఎక్కువగా పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

నిర్మలాబాయ్ ఉన్న ఇంటిపైన యువకులు ఉండటంతో పాటు కింద నుంచి దుండగులు వచ్చే అవకాశం ఉండటంతో దొంగతనం చేసే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు.

గ్యాస్ లీక్ చేయడాన్ని బట్టి హత్యను ప్రమాదంగా చిత్రీంచేందుకు ప్రయత్నించారని.. లాగే చెవుల్లోని కమ్మలను దొంగిలించుకు వెళ్లడం ద్వారా దీనిని దొంగల పనిగా నమ్మించేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది.

దీనిని బట్టి ఎవరో తెలిసిన వ్యక్తులే ఆమెను హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం నిర్మలాబాయ్ మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. 

click me!