
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా ఆశోక్‌గజపతిరాజును తొలగించి తనను నియమించాలని ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సంచయిత గజపతిరాజు స్థానంలో మాజీ కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు ఈ ఏడాది జూన్ 17వ తేదీన నియామకమయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశోక‌్‌గజపతిరాజును ఛైర్మెన్ బాధ్యతలను తప్పించి సంచయిత గజపతిరాజును ఛైర్మెన్ గా నియమించారు.
also read:మాన్సాస్ ట్రస్ట్ ఈవోకి హైకోర్టు నోటీసులు,ఆగ్రహం: ఆశోక్‌గజపతి పిటిషన్ పై విచారణ
ప్రస్తుతం ఛైర్మెన్ గా ఆశోక్‌గజపతిరాజు కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆశోక్‌గజపతిరాజు సోదరుడు ఆనందగజపతి రాజు రెండో భార్య కూతురు ఊర్మిళ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చకు దారితీస్తోంది.ఆశోక్‌గజపతిరాజు ను ఈ పదవి నుండి తప్పించి తనకు ఈ పదవిని కేటాయించాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది.
ఊర్మిళ, సంచయితలను ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆశోక్‌గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా తొలగించాలని ఊర్మిళ తరపు న్యాయవాది కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.