తల్లీ, కూతుర్లతో సహజీవనం, హత్య.. కరోనా పేరు చెప్పి...

By AN TeluguFirst Published Feb 2, 2021, 12:58 PM IST
Highlights

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మరో దారుణం వెలుగు చూసింది. తల్లీ, కూతుళ్లతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి వారిని దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 
 

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మరో దారుణం వెలుగు చూసింది. తల్లీ, కూతుళ్లతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి వారిని దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డిపల్లె పంచాయతీ ఏటిగడ్డ తాండాకు చెందిన గంగులమ్మ(65), ఆమె కుమార్తె సరళ (40)లతో నిందితుడు మౌలాలి సహజీవనం చేస్తున్నాడు. 

వీరికి ముగ్గురు చిన్న పిల్లలు. వీరందరూ వారి పొలంలోని షెడ్డులో నివసించేవారు. ఈ క్రమంలో మౌలాలికి సరళపై అనుమానం మొదలయ్యింది. దీంతో ఆమెను గత అక్టోబర్‌ 29న ప్లాన్ ప్రకారం హతమార్చాడు. 

పెద్దేరు ప్రాజెక్టులో మృతదేహాన్ని పడేసి, పైకి తేలకుండా రాళ్లు కట్టాడు. మూడు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో గంగులమ్మ మౌలాలిని నిలదీసింది. అంతేకాదు మౌలాలి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించింది. దీంతో గంగులమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె మెడకు చీరతో ఉరివేసి హత్య చేశాడు.

గంగులమ్మ మృతదేహాన్ని దగ్గర్లోని గంగచెరువులో వేశాడు. అంతేకాదు శవం పైకి తేలకుండా చీరను కంపచెట్లకు కట్టేశాడు. తెల్లారి ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోవడంతో పిల్లలు అమ్మ, అమ్మమ్మ గురించి మౌలాలిని అడిగారు. 

వారిద్దరికి కరోనా సోకిందని 15 రోజుల దాకా ఇంటికి రారని చెప్పి మభ్యపెట్టాడు. ఇక్కడుంటే విషయం ఎలాగో భయటపడుతుందని భావించి ముగ్గురు పిల్లల్ని కర్ణాటకలోని గౌనుపల్లెకు తీసుకువెళ్లి, అక్కడ దాచాడు.

తాను కూడా అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఏటిగడ్డ తాండాకు వచ్చి మృతదేహాలు తేలాయా; విషయం బైటపడిందా అని చెక్ చేసుకుని వెడుతున్నాడు. అయితే కొద్దిరోజులుగా సరళ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండడంతో ఆమె బంధువైన ధనమ్మకు ఏమైందోనన్న సందేహం వచ్చింది. ఆమె ఏటిగడ్డ తాండాకు వచ్చింది.

అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లను అడిగింది. అయితే ఏమీ ఫలితం దక్కలేదు. దీంతో ఆమె తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిమీద ములకల చెరువు సీఐ సుకుమార్, ఎస్‌ఐ సహదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం మౌలాలిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. 

దీంతో సోమవారం మౌలాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాలు కుళ్లిపోయి, బట్టలు, ఎముకల గూళ్లు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు ముగ్గురు మైనర్లు కావడంతో బంధువులకు అప్పగించారు. 

click me!