
అవనిగడ్డ : ఆన్ లైన్ లోన్ యాప్స్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. మీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తామంటూ మొదట వెంటపడే లోన్ యాప్స్ సిబ్బంది ఆ తర్వాత అధిక వడ్డీల వసూలుకు వెంటపెడతారు. ఇక సకాలంలో లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేదో అంతే సంగతి... మాటిమాటికి ఫోన్ చేయడం, అవసరమైతే బెదిరించడం, చివరకు బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడకుండా నరకం చూపిస్తారు. ఇలా లోన్ యాప్ వేధింపులకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో యువకుడు బలయ్యాడు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లికి చెందిన మహ్మద్ జాబ్ జాన్ భార్యా, కుమారుడితో కలిసి విజయవాడలో వుండేవాడు. విజయవాడలోని ఓ పాల ప్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి అత్యవసరంగా డబ్బులు అవసరం పడ్డారు. దీంతో ఓ ఆన్ లైన్ లోన్ యాప్ నుండి డబ్బులు తీసుకుని అవసరం తీర్చుకున్నాడు.
అయితే అవసరమయితే తీరిపోయింది కానీ తీసుకున్న లోన్ ఎలా తిరిగి చెల్లించాలో మహ్మద్ కు అర్థంకాలేదు. డబ్బులు లేకపోవడంతో గడువులోపు లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులు మొదలయ్యారు. రోజురోజుకు ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది ఒత్తిడి తట్టుకోవడం మహ్మద్ వల్ల కాలేదు. దీంతో ప్రాణాలు తీసుకోవాలన్న దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
Read More వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి బలి.. అధికార యంత్రాంగంపై విమర్శలు, జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం
గత రాత్రి తన గదిలో ఎవరూలేని సమయంలో మహ్మద్ జాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన వారు కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా వాళ్లు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంగా గది తలుపులు తెరిచి వెళ్లిచూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.
మృతదేహాన్ని కిందకుదించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణంగా గుర్తించారు. మహ్మద్ లాగే ఇప్పటివరకు అనేకమంది ప్రాణాలను బలితీసుకున్న లోన్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.