చంద్రబాబుకి లేఖ రాసి.. వ్యక్తి ఆత్మహత్య... కలకలం

By ramya neerukondaFirst Published Aug 20, 2018, 3:26 PM IST
Highlights

నాకు జరిగిన అన్యాయం మా పిల్లలకు జరగకూడదని మన నాయకులంతా కలసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారని, నా బలి దానంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆశిస్తూ సెలవు

రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరుతూ.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాసి.. ఆ తర్వాత  ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...కడప జిల్లా రాజంపేటకు చెందిన యానాదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని కమ్మపాలెంలో ఉంటున్నాడు. 

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని సిమెంటు కొట్లో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఆదివారం రాత్రి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని బాటసారి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అతని జేబులో సూసైడ్‌ నోట్‌ దొరికింది. అది ఈనెల 6వతేదీన రాసినట్లు ఉంది.

ఆ లేఖలో ఏముందంటే...‘ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమ్మపాలెంలో నివాసం ఉండే పైడికొండలు యానాదయ్య అను నేను రాస్తున్నది ఏమనగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల చిన్నచూపు చూసింది. కట్టుబట్టలతో బయటకు పంపించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వస్తుందని ఎదురుచూసినా బీజేపీ మోసం చేసింది. నాకు జరిగిన అన్యాయం మా పిల్లలకు జరగకూడదని మన నాయకులంతా కలసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారని, నా బలి దానంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఆశిస్తూ సెలవు’ అని రాసి ఉంది. 

నా బిడ్డలకు టీడీపీ తరఫున మీరే పెద్ద దిక్కుగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌ను ఆ లేఖలో కోరారు. సంఘటనా స్థలంలో పురుగు మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. తాలూకా ఎస్సై రాజారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!