
కర్నూలు: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన దేశంలోని అన్ని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్బంగా జ్యోతిర్లింగాల్లో ఒకటయిన శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం పరిసరాలు భక్తజనసంద్రంతో నిండిపోయాయి.
శ్రీశైలానికి భక్తులు పోటెత్తడంతో నల్లమల అడవిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం-దోర్నాల మధ్య మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకేసారి అధిక సంఖ్యలో ఆర్టీసి బస్సులు రోడ్డెక్కడమే ఈ ట్రాఫిక్ జామ్ కు కారణమని తెలుస్తోంది. అధికారుల అవగాహన రాహిత్యమే ఈ ట్రాఫిక్ జామ్ కు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.