
కృష్ణా జిల్లా (krishna district) మచిలీపట్నం (machilipatnam) వైసీపీలో (ysrcp) వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) , ఎంపీ వల్లభనేని బాలశౌరీకి (vallabhaneni balashowry) పడటం లేదు. ఈ నేపథ్యంలో నానిపై బాలశౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని.. సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా అని బాలశౌరి ప్రశ్నించారు.
టీడీపీ (tdp) నేత కొనకళ్లతో (konakalla narayana) అధికార పార్టీ ఎమ్మెల్యే పనేంటీ అని ఎంపీ నిలదీశారు. వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్ధం కావడం లేదంటూ బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి బందరులోనే వుంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా.. శుక్రవారం పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బాలశౌరి పర్యటనను అజ్గర్ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని .. కానీ తమను ఎంపీ పట్టించుకోవడం లేదంటూ అజ్గర్ ఆవేదన వ్యక్తం చేశాడు.