
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. ఇక, జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, టీడీపీ కార్యాలయం, పలువ వాహనాలను వైసీపీ కార్యకర్తలను తగలపెట్టారని టీడీపీ ఆరోపించింది.
అయితే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు తీవ్ర ఆగ్రహం చేశారు. పోలీసులు తీరును తప్పుబట్టారు. అయితే మాచర్లలో చోటుచేసుకన్న పరిణామాల నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచడమో, అరెస్ట్ చేయడమో చేశారు. మాచర్ల పట్టణంలోకి రాకుండా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. బయట నుంచి మాచర్లలోకి కొత్త వ్యక్తులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరులోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటుచేసుకుంది. పలువురు టీడీపీ నేతల ఆఫీసు బయట పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు టీడీపీ కీలక నేతల కదలికలపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.