
టీడీపీకి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని ఛాలెంజ్ చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఏమంటారో చూడాలి. కాగా.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలతో మాచర్ల రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అయితే మిరియాలలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వంజ స్థంభం ప్రతిష్ట నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల టీడీపీ ఇన్‍ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆవులయ్యకు చెందిన ట్రాక్టర్‍పై ఊరేగింపుగా తీసుకొచ్చారు.
అయితే అర్దరాత్రి వేళ ఊరేగింపుకు వినియోగించిన ఆవులయ్య ట్రాక్టర్‌ను దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. అయితే వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ దాడులకు భయపడేదే లేదని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఫ్రస్టేషన్‌తో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘వీళ్లసలు మనుషులేనా? ఉదయం లేచింది మొదలు తగలబెట్టడం....పగలగొట్టడం..ఇదే పనా? వైసీపీ సైకోలకు కళ్ళ ముందు భవిష్యత్ ఓటమి కనిపించడమే ఈ ఫ్రస్ట్రేషన్‌కు కారణం. పల్నాడులో టీడీపీ ఇంఛార్జిని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా తెచ్చారని...దాన్ని తగలబెట్టడం నీచమైన చర్య’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.