సినీ ఫక్కీలో ఎస్కేప్.. యువతిని కారులోకి నెట్టి, కదులుతున్న కారులోకి జంప్ చేసి.. ప్రేమికుడి సాహసం..

By AN TeluguFirst Published Aug 28, 2021, 9:17 AM IST
Highlights

కాకినాడకు చెందిన యువకుడు (24), కరప మండలానికి చెందిన యువతి (25) ప్రేమించుకున్నారు. 40 రోజుల క్రితం వారు వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీసు ఇచ్చారు.

కాకినాడ : సినిమా రేంజ్ లో లవర్ ను తల్లిదండ్రులకు దొరక్కుండా తీసుకెళ్లాడో ప్రేమికుడు. అచ్చం..మన తెలుగు సినిమాల్లో చూపించే సీన్ అక్కడ రియల్ గా కనిపించింది. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు జరిగిన ఈ ఘటన స్థానికులు అవాక్కయ్యేలా చేసింది.

నవమాసాలు మోసి పెంచాను. పైగా నీకేది కావాలంటే అదిస్తే ఇలా మమ్మల్ని అన్యాయం చేస్తావా.. అంటూ ఆ యువతి తల్లి కంటతడి పెడుతూ బతిమిలాడుతుండగానే...ఆ యువతిని ప్రేమికుడు బయటకు తీసుకొచ్చి కారులోకి నెట్టి తీసుకువెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కారులో వెంబడిస్తూ వెళ్లినా కనిపించలేదు. సినీ ఫక్కీని తలపించిన ఈ ఘటన శుక్రవారం కాకినాడలో జరిగింది. 

ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన యువకుడు (24), కరప మండలానికి చెందిన యువతి (25) ప్రేమించుకున్నారు. 40 రోజుల క్రితం వారు వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీసు ఇచ్చారు.

గడువు పూర్తి కావడంతో శుక్రవారం అక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు. అప్పుడే అక్కడికి కారులో వచ్చిన యువతి తల్లిదండ్రులు తమతో వచ్చేయమంటూ ఆమెను బతిమిలాడారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గలాటా పరిస్థితి నెలకొంది. అదే సమయంలో యువకుడు యువతిని తీసుకుని కార్యాలయ గేటు బైటకు వచ్చాడు.

అప్పటికే అక్కడ కారు డోరు తీసి అతడి స్నేహితుడు సిద్ధంగా ఉన్నాడు. యువతిని కారులోకి నెట్టి తాను కూడా కదులుతున్న ఆ కారు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినప్పుటికీ వారికి కనిపించకుండా పోయింది. దీంతో ఆ యువతి తల్లి తల్లడిల్లుతూ కన్నీరు పెట్టడం అక్కడివారిని కలిచి వేసింది. 

click me!