రఘురామ కృష్ణం రాజు విషయంపై నివేదిక కోరిన లోకసభ స్పీకర్ ఓం బిర్లా

By telugu teamFirst Published May 22, 2021, 7:04 AM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం సభా హక్కుల కమిటీ చెంతకు చేరింది. రఘురామ కృష్ణం రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదును స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి పంపించారు.

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అంశంపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరారు. రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును ఆయన సభా హక్కుల కమిటీకి పంపించారు. రఘురామ కృష్ణం రాజును ఏపీ సిఐడి అరెస్టు చేయడంపై ఆయన భార్య రమాదేవి, కుమారుడు భరత్, కూతురు ఇందిరా ప్రియదర్శిని ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

రఘురామ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం హోంశాఖను కోరింది. రఘురామ కృష్ణం రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రతిని హోం శాఖకు పంపించింది. రఘురామ కస్టడీపై, పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. 

అంతకు ముందు రోజు రఘురామ కృష్ణం రాజు కుటుంబ సభ్యులు కేంద్ర హోం  మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అరెస్టు విషయంపై వారు ఆయన దృష్టికి తెచ్చారు. కాగా, సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణం రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. 

రఘురామ కృష్ణం రాజు కాలి పాదం వేలికి ఫ్రాక్చర్ ఉందని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తమ నివేదికను అందించింది. అయితే, ఆ గాయం కొట్టడం వల్ల అయిందనే విషయం వైద్యుల బృందం తేల్చలేదని సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. 

click me!