
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అయితే సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ మర్కాపురంలోనిహెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ జగన్ జమ చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ 12.40 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.