తిరుమలలో మరోసారి మద్యం కలకలం.. శ్రీవారి ఆలయ సమీపంలోని హెచ్‌టీ కాంప్లెక్స్‌లో పట్టుబడ్డ 5 బాటిల్స్..!

By Sumanth KanukulaFirst Published May 21, 2023, 3:52 PM IST
Highlights

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మరోసారి అపచారం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని హెచ్‌టీ కాంప్లెక్స్‌లోని షాప్‌ నెంబర్ 78లో 5 మద్యం బాటిల్స్‌ పట్టుబడ్డాయి. 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మరోసారి అపచారం చోటుచేసుకుంది. తిరుమలలో ఇటీవలి కాలంలో మద్యం, మాంసం, గంజాయి పట్టుబడటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని హెచ్‌టీ కాంప్లెక్స్‌లోని షాప్‌ నెంబర్ 78లో 5 మద్యం బాటిల్స్‌ పట్టుబడ్డాయి. 

దుకాణదారుడు తన స్నేహితులతో సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ అధికారులు సోదాలు నిర్వహించడంతో మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. దీంతో అధికారులు షాప్‌ను సీజ్ చేసి.. దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, తిరుమలలో మద్యం బాటిల్స్, గంజాయి పట్టుబడుతుండటంపై  శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకడ్డ వేయాలని కోరుతున్నారు. 

తిరుమల కొండపైకి మద్యం, గంజాయి తరిలిస్తుంటే విజిలెన్స్‌ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేస్తున్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఇక, తిరుమల హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మద్యం, మాంసాహారం తినడం, పొగాకు నమలడం, సిగరెట్లు తాగడం వంటి వాటిపై నిషేధం ఉంది. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తున్న టీటీడీ ఈ నిషేధాజ్ఞలను అమలు చేసేందుకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. 

click me!