
వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగురకూడదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం ఆయన భీమవరంలో పవన్ సమక్షంలో కాకినాడకు చెందిన లాయర్ తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన వున్న వ్యక్తుల మద్ధతు అవసరమన్నారు. చట్టాలపై అవగాహన వున్న వ్యక్తుల్లో తోట సుధీర్ ఒకరని పవన్ తెలిపారు.
ఆయన కుటుంబంతో తనకు పరిచయం వుందని జనసేనాని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకూడదని.. వైసీపీ గెలవకూడదు అనడానికి ఎన్నో కారణాలు వున్నాయని పవన్ తెలిపారు. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి లేదని, రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువుయ్యాయని .. ప్రభుత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని పవన్ మండిపడ్డారు.
సుధీర్ లాంటి వ్యక్తుల రాకతో పార్టీ బలంగా పుంజుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాల్లో అమ్ముడుపోవడం తేలికని, తాను మాత్రం పుట్టిన నేల బాగుండాలనే కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. నిజాయితీగా రాజకీయాలు చేయడం కష్టమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. రాజకీయాల్లోకి మరింత మంది సమర్ధులు రావాలని పవన్ పిలుపునిచ్చారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రాజమండ్రిలో సమావేశం అవుదామని ఆయన తెలిపారు. కాగా.. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న తొలి దశ వారాహి విజయ యాత్ర ఇవాళ్టీతో ముగియనుంది. సాయంత్రం భీమవరంలోని అంబేద్కర్ సెంటర్‌లో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.