
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు అంగీకరించవద్దని ఆ లేఖలో సీఎం జగన్‌ను కేవీపీ కోరారు. పోలవరం ప్రాజెక్టు సమస్యపై కేవీపీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం జగన్‌కు రాసిన లేఖలో.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం వల్ల ప్రాజెక్టు ప్రయోజనం నెరవేరదని పేర్కొన్నారు. కేంద్రంతో రాజీపడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టేనని అన్నారు.
1980లో గోదావరి ట్రిబ్యునల్ అంగీకరించిన తర్వాత కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన అనుమతుల మేరకు పోలవరం ప్రాజెక్టును +150 అడుగుల స్థాయిలో నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని జగన్ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్పలేకపోతున్నదని అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, విశాఖపట్నంలకు నీరందించేందుకు వైఎస్సార్ కలలుగన్న ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరగడం బాధాకరమని పేర్కొన్నారు.
‘‘రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. దీనిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత ప్రభుత్వం స్వాగతించింది. మీరు (జగన్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. నాలాంటి వారు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి అప్పగిస్తారని అనుకున్నారు. తద్వారా రాష్ట్రంపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉండేది. అయితే అది జరగలేదు’’ అని కేవీపీ పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రం చేపట్టిన తర్వాత నిధుల విడుదల, ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల పరిష్కారం, డీపీఆర్ క్లియరెన్స్‌లో కేంద్రం నిష్క్రియంగా మారిందని కేవీపీ అన్నారు. ‘‘భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు అవసరం. అయితే దీనితో సంబంధం లేనట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రం సొంతంగా ప్రాజెక్టును చేపట్టే పరిస్థితి లేదు’’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ప్రాజెక్టు ఎత్తును +140కి తగ్గించాలన్న కేంద్రం సూచనను వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించేందుకు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై లేఖలో కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎత్తు +150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్ కంటే తక్కువ ఉంటే.. ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదని.. దానితో అనుకున్న ప్రయోజనం చేకూరదని అన్నారు. 140 నుంచి 150 అడుగుల మధ్య కాంటూర్‌లో సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే బాధ్యత నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి సూచన చేస్తోందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు వ్యయం పూర్తిగా కేంద్రమే భరించాలని అన్నారు. ఇందుకోసం 2017లో తాను హైకోర్టులో పిటిషన్ కూడా వేశానని చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయనందున.. గత ఐదున్నరేళ్లుగా విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పారు. కేంద్రం ఒత్తిడి తెచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపును అంగీకరించవద్దని జగన్‌ను కోరారు.