వార్నీ.. ప్రారంభించిన మొదటి రోజే.. ప్రయాణికులు ఎక్కకుండానే తుర్రుమన్న కువైట్ విమానం..

By SumaBala BukkaFirst Published Mar 29, 2023, 3:11 PM IST
Highlights

20 మంది ప్రయాణికులకు వదిలేసి కువైట్ కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన ఘటన ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేపింది. 

గన్నవరం : ఆంధ్రప్రదేశ్ లోని  గన్నవరంలో ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్ ఇండియా సర్వీస్ ప్రారంభమయ్యింది. ప్రారంభమైన మొదటి రోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు ఝలక్ ఇచ్చింది. ప్రయాణికులు ఎక్కకుండానే విమానం తుర్రుమంది. ప్రయాణికులను వదిలేసి విమానం టేక్ ఆఫ్ అయిపోవడంతో ఏం చేయాలో పాలుపోని ప్రయాణికులతో విమానాశ్రయంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది.

బుధవారం ఉదయం 9.55 నిమిషాలకు గన్నవరం నుంచి కువైట్ కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం దాదాపు 67 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 20 మంది ప్రయాణికులు విమానం ఎక్కాల్సి ఉంది. ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకి వీరంతా కువైట్ కి వెళ్లే  విమానం కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే విమానం వెళ్ళిపోయింది. ఈ  సమాచారం తెలియడంతో వీరంతా ఖంగు తిన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 20 మంది ప్రయాణికులు ఇలా విమానం మిస్ అవ్వడంతో విమానాశ్రయంలో గందరగోళం  చెలరేగింది. 

వివేకా హత్య కేసు.. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న సుప్రీం.. కొత్త సిట్ ఏర్పాటు..

ఒంటిగంట పది నిమిషాలకి  విమానం బయలుదేరాల్సి ఉండగా.. 9.55కే వెళ్లిపోవడం ఏమిటని వీరంతా ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీశారు. దీంతో, సిబ్బంది విమానం ఉదయం 9.55 నిమిషాలకే  బయలుదేరుతుందని మెసేజ్ పెట్టామని తెలిపారు. కానీ, 20 మంది ప్రయాణికులు మాత్రం.. టైం చేంజ్ కు సంబంధించి తమకు ఎలాంటి మెసేజ్ రాలేదని  ఏయిర్ ఇండియా అధికారుల మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము  కువైట్ వెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆందోళనకు దిగారు 20 మంది ప్రయాణికులు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి కువైట్, దుబాయ్ లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులను నడిపేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే బుధవారం నాడు కువైట్ సమ్మర్ సర్వీస్ ని ఎయిర్ ఇండియా ప్రారంభించింది. ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రతి బుధవారం ఎయిర్ ఇండియా విమానం కువైట్ కు నడుపుతారు. 

click me!