
కర్నూలు : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తల్లీ కూతుళ్ల జంట హత్యల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు శ్రావణ్ కు చంపడం ఇష్టం లేదని తేలింది. తన తండ్రికి కలిగిన అనుమానం, అతను అవమానంగా భావించిన ఓ విషయం వల్లే కొడుకును ప్రోత్సహించి, ప్రేరేపించి హత్య చేయించాడని తెలుస్తోంది. పెళ్లయిన రెండు వారాలకే భార్యను, అత్తను ఇంటికి తీసుకువెళ్లి.. అతికిరాతకంగా చంపిన కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలులో ఓ వ్యక్తి అనుమానంతో తండ్రితో కలిసి కొత్తగా పెళ్లయిన భార్యను, ఆమె తల్లిని కూరగాయలు కోసే కత్తితో దాడి చేసిచంపిన ఘటన మంగళవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి ప్రాణాలు కోల్పోయారు. వీరి మీద దాడికి అడ్డుకోబోయిన తండ్రి వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కేసులో పోలీసులు రుక్మిణి భర్త శ్రావణ్, శ్రావణ్ తండ్రి ప్రసాద్, తల్లి కృష్ణవేణిల మీద హత్యకేసు నమోదు చేసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. పెళ్లైన రెండు వారాలకే కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు, శ్రావణ్ కు అత్తింటి వారు సున్తీ శస్త్ర చికిత్స చేయించారు. దీంతో తమ పరువు పోయిందన్న కోపంతో శ్రావణ్ తండ్రి ప్రసాద్ వారిని హత్య చేయాలని ప్రేరేపించినట్లుగా తెలుస్తోంది.
పెళ్లైన రెండు వారాలకే.. భార్యను, అత్తను కడతేర్చిన అల్లుడు.. కారణం ఏంటంటే..
ముందుగా శ్రావణ్ దీనికి ఒప్పుకోకపోతే.. తండ్రి ప్రసాదే పట్టు పట్టి భార్యను, అత్తను చంపడానికి ఒప్పించాడట. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం శ్రావణ్ మంగళవారం నాడు వనపర్తికి వెళ్లి భార్యను, అత్తమామలను కర్నూలులోని తమ ఇంటికి తీసుకువచ్చాడు. శ్రావణ్ వాళ్లు వచ్చే సమయానికి అతని తండ్రి ప్రసాద్ బజార్ నుంచి రెండు కత్తులు కొని తీసుకువచ్చాడు. వారు వచ్చిన కాసేపటికి.. శ్రవణ్ లోపలికి వెళ్లి.. తండ్రి తెచ్చిన కత్తులతో బయటికి వచ్చాడు. ఆ తరువాత తండ్రి ప్రసాదుతో కలిసి రుక్మిణి, రమాదేవిలను ఆ కత్తులతోనే విచక్షణా రహితంగా పొడిచి చంపారు. అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లు మీద కూడా దాడి చేశారు. దీంతో అతనికి కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని కేకలు, అరుపుల హడావుడికి వచ్చిన చుట్టుపక్కల వారు గమనించి వెంకటేశ్వర్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స జరుగుతోంది. పోలీసులకు సమాచారం అందించారు.
ఇక ఈ ఘటనలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన తల్లి కూతుర్లు రుక్మిణి, రమాదేవి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు.. వాటికి అంత్యక్రియలు చేసేందుకు వారి బంధువులు ఎవరు రాలేదు. 20 ఏళ్ల క్రితం రమాదేవి, వెంకటేశ్వర్లు కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహం వల్ల వారు ఇరువురి కుటుంబాలకు దూరమయ్యారు. మృతదేహాలను తీసుకువెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో బుధవారం నాడు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత… పోలీసులే కల్లూరు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.