టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సమకాలికుడిగా, రాజకీయాల్లో కలిసి పని చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి నవంబర్ సంక్షోభం వచ్చే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వరుస ఇబ్బందులతో సతమతమవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.
అంతేకాదు మాజీ శాసన సభస్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించారు. వీటన్నింటిని తట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని టీడీపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తూనే ఉన్నారు.
ఇటీవలే కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించారు. ఇకపోతే మరో కీలక నేత, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ సైతం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.
కృష్ణా జిల్లాకు ఆయువుపట్టులాంటి ఇద్దరు నేతలు హ్యాండ్ ఇవ్వడంతో దాన్ని నుంచి కోలుకుంటున్న తరుణంలో కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత కుటుంబం సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సమకాలికుడిగా, రాజకీయాల్లో కలిసి పని చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసారు. అంతేకాదు కీలక శాఖ అయిన రెవెన్యూ శాఖకు మంత్రిగా పనిచేశారు.
రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సమయమంలో కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వంలోని పెద్దలపైనా, అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఒకానొక దశలో ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడును సైతం వదల్లేదు.
అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయనని ముందే బాహటంగా ప్రకటించారు కేఈ కృష్ణమూర్తి. దాంతో ఆయన తనయుడు శ్యామ్ పత్తికొండ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ సైతం పోటీచేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం కేఈ సోదరుడు ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన కేఈ కుటుంబం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెుదపడం లేదు. రాజకీయాలకు దూరంగా కేఈ కృష్ణమూర్తి ఉన్నప్పటికీ ఆయన సోదరుడు గానీ, కుమారుడు శ్యామ్ బాబు గానీ అసలు కనిపించడం లేదు.
పార్టీ బలోపేతం కోసం గానీ, పార్టీ కార్యక్రమాల్లో గానీ చురుగ్గా పాల్గొనడం లేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీపట్ల అంతగా అసంతృప్తితో ఉన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే బాహటంగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. ప్రభుత్వం తీరుపై నిరసన గళం విప్పారు. దాదాపుగా ఆయన పార్టీలో ఉండరంటూ ప్రచారం కూడా జరిగింది. అలాంటి తరుణంలో ఆయన సోదరుడు ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో కాస్త చల్లబడ్డారు.
ఇకపోతే 2014 ఎన్నికల అనంతరం కర్నూలు జిల్లాలో తమకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న భూమా కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడంపై అలక బూనిన సంగతి కూడా తెలిసిందే.
నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ కేఈ కృష్ణమూర్తికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం ఉండేది. అయినప్పటికీ అలానే ఉండిపోయారు కేఈ కృష్ణమూర్తి. అప్పటికే పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న కేఈకి మరోషాక్ ఇచ్చారు చంద్రబాబునాయుడు.
ఎన్నికల ముందు సుదీర్ఘ కాలంగా తమ రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండానే వారిని ఆహ్వానించారంటూ చిర్రుబుర్రులాడారు.
చివరికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో అయిష్టంగానే కేఈ అంగీకరించాల్సి వచ్చింది. చంద్రబాబు కోరటంతో అయిష్టంగానే కేఈ అంగీకరించాల్సి వచ్చింది. కోట్ల కుటుంబం టీడీపీలోకి చేరినంత మాత్రాన తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని స్వపక్షంలోనే విపక్షంగా ఉన్నారంటూ ఆయన అనుచరులు వద్ద వాపోయారట.
టీడీపీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీ వీడటం, కేసుల్లో ఇరుక్కోవడంతో కేఈ సోదరులు వైసీపీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేఈ శ్యాంబాబుపై ఇప్పటికే పలు హత్యాఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేఈ సోదరులు టీడీపీలోకి చేరితేనే బెటర్ అని ఆయన అనుచరులు సైతం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పత్తికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీదేవి కేఈ కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నారు. కేఈ కుటుంబాన్ని వైసీపీలోకి ఆహ్వానిస్తే మెుదట వ్యతిరేకించే వ్యక్తులలో ఆమె అని తెలుస్తోంది. తన భర్త నారాయణ రెడ్డి హత్య కేసులో శ్యామ్ ప్రమేయం ఉందంటూ ఆమె నేరుగా ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.
దాంతో ఆమె నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే కేఈ సోదరులు మాత్రమే వైసీపీలో చేరి అనంతరం కుమారుడికి రూట్ క్లియర్ చేద్దామన్న భావనలో ఉన్నారట. ఇప్పటికే జిల్లాకు చెందిన బీసీ మంత్రితో కేఈ సోదరులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
త్వరలోనే కేఈ సోదరులు ఆ మంత్రి నేతృత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇది గనుక జరిగితే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో ఉన్నప్పటికీ బయటకు రాని పరిస్థితి.
ఇక ఉన్నవారిలో మాజీమంత్రి భూమా అఖిలప్రియ మాత్రమే కాస్త దూకుడుగా ఉన్నారు. ఆమెకు సైతం కుటుంబ సభ్యుల అండదండలు లేవు. ఆమె కూడా ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. ఆమెపై కూడా కుటుంబ సభ్యులు ఒత్తిడిపెంచినా, అనుచరులు పార్టీ మారాలని కోరిన ఆమె టీడీపీలో ఉంటారా లేదా అన్నది కూడా సందేహమే. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తికి షాక్ లపై షాక్ లు ఇచ్చిన చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు కేఈ సోదరులు. చంద్రబాబు మూడుసార్లు షాక్ ఇచ్చినా తట్టుకుని నిలబడ్డ కేఈ ఫ్యామిలీ ఇప్పుడు వారు ఇచ్చే ఒకే ఒక్క షాక్ తో చంద్రబాబు కుదేలవ్వక తప్పదన్నమాట.
ఈ వార్తలు కూడా చదవండి
వల్లభనేని వంశీ వ్యూహం ఇదే: అదే జరిగితే చంద్రబాబుకు పెద్ద దెబ్బ
ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరోషాక్: రాజీనామా యోచనలో అశోక్ రెడ్డి..?