చింతలముని స్వామి రథోత్సవంలో అపశృతి... ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Aug 18, 2021, 11:55 AM IST
Highlights

కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెసలబండ గ్రామంలో విషాదం నెలకొంది. చింతలముని స్వామి రథోత్సవం కోసం రథాన్ని సిద్దం చేస్తుండగా కరెంట్ షాక్ గురయి ఇద్దరు దుర్మరణం చెందారు. 

కర్నూల్: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా రథోత్సవం నిర్వహించాలని గ్రామస్తులు భావించారు. ఇందుకోసం రథాన్ని సిద్దం చేయడానికి ప్రయత్నిస్తూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెసలబండ గ్రామంలో ప్రతి ఏడాది చింతలముని స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన గ్రామస్తులు ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్వామివారిని ఊరేగించే రథాన్ని సిద్దం చేయడానికి ప్రయత్నించగా ఘోర ప్రమాదం జరిగింది. 

Latest Videos

read more  వెంటపడుతుందని.. హిజ్రా తలపగలగొట్టిన యువకుడు.. అక్కడికక్కడే మృతి....

దేవాలయంలోని రథాన్ని బయటకు తీస్తుండగా అది విద్యుత్ తీగలను తగిలింది. దీంతో రథాన్ని తోస్తున్న వెంకటేష్, బారి అనే ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురయి అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. అదోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి కూడా విషమంగా వుందని తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రథోత్సవంతో సంబరాలు జరగాల్సిన గ్రామంలో ఈ ఘటనతో విషాదం నెలకొంది. 
 

click me!