చంద్రబాబుకు చిక్కులు: సీటు కోసం టీజీ, ఎస్వీ కుస్తీ

By Nagaraju TFirst Published Jan 24, 2019, 11:04 AM IST
Highlights

మాజీమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడును కలిసిన టీజీ వెంకటేష్ సర్వేల్లో బాగా ఉందంటేనే తన కుమారుడు టీజీ భరత్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని, ఒకవేళ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి అనుకూలంగా వస్తే ఆయనకే ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు స్పష్టం చేశారు. 

అమరావతి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పెద్ద సవాల్ విసురుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. 

ఒక్కో నియోజకవర్గంపై ఆశావాహులు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గం సీటు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగకముందే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో మరో తలనొప్పి ఎదురైంది. 

కర్నూలు అసెంబ్లీ సీటు నాదంటే నాదేనంటూ సీనియర్ రాజకీయ నేతలు పోటీపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి కూడా బరిలోకి దిగి గెలుపొందాలని ఆలోచిస్తుంటే మరోవైపు రాజ్యసభ సభ్యుడు తన కుమారుడిని బరిలోకి దింపి అసెంబ్లీలో అడుగుపెట్టించాలని ప్రయత్నిస్తున్నారు. 

దీంతో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక చంద్రబాబు నాయుడు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు సర్వేల పేరుతో తప్పించుకున్నా అవికాస్త లీకవ్వడంతో టిక్కెట్ నాదంటే నాదంటూ నేతలు సవాల్ విసురుకుంటున్నారు.  

వాస్తవానికి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరిపోయారు. 

అప్పటికే టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ తన కుమారుడిని కర్నూలు నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి సైకిలెక్కడంతో కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయం సందిగ్ధంలో పడింది.  
   
కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ తన కుమారుడిదేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రచారం చేసుకుంటుంటే సిట్టింగ్ అయిన తనను కాదని మరోకరికి టిక్కెట్ ఇవ్వరంటూ ఎస్వీ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇరువురి ప్రచారంతో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. 

టీజీ వెంకటేష్ తన కుమారుడి పోటీ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం మాజీమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడును కలిసిన టీజీ వెంకటేష్ సర్వేల్లో బాగా ఉందంటేనే తన కుమారుడు టీజీ భరత్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని, ఒకవేళ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి అనుకూలంగా వస్తే ఆయనకే ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు స్పష్టం చేశారు. 

తన కుమారుడికే టికెట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సర్వేలో వస్తేనే నాకివ్వండని చెప్పడమే నాయకుడి లక్షణమని, మోహన్‌రెడ్డి ఆ మాట చెప్పలేకపోతున్నారని విమర్శించారు. 

‘నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నాకే టిక్కెట్‌ ఇవ్వాలి. నా కుటుంబానికే ఇవ్వాలంటే ఏ నాయకుడూ అంగీకరించరన్నారు. సర్వేలో బాగాలేదని వస్తే నా కుమారుడికి టికెట్‌ ఇచ్చినా తీసుకోమంటూ పరోక్షంగా విజయంపై టీజీ వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు కర్నూలు అసెంబ్లీ సీటు తనదేనని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరోకరికి టిక్కెట్ ఇచ్చే సాహసం చంద్రబాబు చెయ్యరని స్పష్టం చేశారు. 

పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సర్వేల్లో తనకు అనుకూలంగా నివేదిక వచ్చిందని మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకి కూడా తెలుసన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమనీ, సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మెుత్తానికి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఒకవైపు, టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ మరోవైపు కర్నూలు టిక్కెట్ పై పోటీపడుతున్నారు. మరి చంద్రబాబు ఎవరికి టిక్కెట్ కేటాయిస్తారో వేచి చూడాలి. 

click me!
Last Updated Jan 24, 2019, 11:04 AM IST
click me!