ప్రధాన మంత్రి మోదీ పర్యటనలో భద్రతా లోపం లేదు.. వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ

By Sumanth KanukulaFirst Published Jul 4, 2022, 4:24 PM IST
Highlights

ప్రధాన మంత్రి పర్యటనలో భద్రతా లోపం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలో మీటర్ల దూరంలో బెలూన్లు ఎగరవేశారని చెప్పారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని.. నోటితో ఊది ఎగరవేశారని అన్నారు.

ప్రధాన మంత్రి పర్యటనలో భద్రతా లోపం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలో మీటర్ల దూరంలో బెలూన్లు ఎగరవేశారని చెప్పారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని.. నోటితో ఊది ఎగరవేశారని అన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ రిస్క్ లేదని.. ఎస్పీజీ తమను వివరణ కోరలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పిలుపుతో కొందరు బెలూన్లను ఎగరవేశారని చెప్పారు.హెలికాప్టర్ వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత బెలున్లను ఎగరవేసినట్టుగా తెలిపారు. ఈ చర్యకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని గుర్తించినట్టుగా చెప్పారు.

ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో బెలూన్లను వదిలిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో యువకులు బెలూన్లు వదిలినట్టుగా తేల్చారు. గన్నవరం సమీపంలోని ఓ బిల్డింగ్ పైనుంచి ఈ పని చేసినట్టుగా గుర్తించారు. 

అసలేం జరిగిందంటే..
ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమరవం వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని  వ్యక్తులు ఆకాశంలోకి నల్ల బెలూన్లను వదిలారు. ఎయిర్‌పోర్టుకు కొద్ది  దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ హెలికాఫ్టర్ మార్గంలో డజన్ల కొద్ది బెల్లూన్లు కనిపించాయి. అయితే ఇవి ప్రధాని మోదీ హెలికాప్టర్‌కు సమీపంలోనే ఎగరడం కొంత కలవరానికి గురిచేశాయి. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ బెలూన్లు ఎవరు వదిలారో కనుగొనే ప్రయత్నం చేశారు. బెలూన్లు ఎగరవేయడాన్ని ప్రధాని భద్రతా పరంగా ఎస్‌పీజీ అధికారులు సీరియస్‌గా పరిగణించారనే వార్తలు  కూడా ఉంచాయి. 

మరోవైపు ఏపీ కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ శ్రీ, ఎమ్మార్పీఎస్ నేతలు.. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులు పట్టుకుని గో బ్యాక్ మోదీ అంటూ సుంకర పద్మశ్రీ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకన్నారు. వారి చేతుల్లోని నల్ల బెలూన్లను పగలగొట్టారు. 

click me!