రుణం ఎగవేత కేసు : కొత్తపల్లి గీత దంపతులకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

By Siva KodatiFirst Published Sep 16, 2022, 4:55 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రుణం ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతో పాటు గీత భర్త పీ. రామకోటేశ్వరరావుకూ బెయిల్ మంజూరు చేసింది. బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్ట్. దీంతో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు గీత దంపతులు. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా.. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు రూ. 52 లక్షలు రుణం తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు హైద్రాబాద్ కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. బ్యాంకు నుండి రుణం పొందేందుకు  నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని  చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచారని సీబీఐ అధికారులు ఆరోపించారు.
 

click me!