Kondapalli municipality: వైసీపీ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తతలు.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

By telugu team  |  First Published Nov 22, 2021, 3:03 PM IST

వైసీపీ, టీడీపీ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ సాగింది. ఎన్నిక జరగడానికి కొద్ది సమయం ముందు వైసీపీ కార్యకర్తలు ఒక్క ఉదుటున మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చి ఆందోళనలు చేశారు. కేశినేని నాని గో బ్యాక్ అంటూ నిరసనలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది.
 


అమరావతి: ఉత్కంఠ రేపిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరో మలుపు తిరిగింది. వైసీపీ కార్యకర్తల ఆందోళనలతో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎన్నిక జరగడానికి ముందు వైసీపీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు దూసుకొచ్చారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు. వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు ఓటింగ్‌ను రేపటికి వాయిదా వేశారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చారు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తల ఆందోళనలు కొనసాగాయి. కాగా, ఈ వాయిదాపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికను వాయిదా వేశారని మండిపడ్డారు.

ఇక, కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా తలపడిన సంగతి తెలిసిందే. మొత్తం 29 వార్డులు ఉండగా.. అక్కడ టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో విజయం సాధించాయి. మరో స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. గెలిచిన వారే మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది.

Latest Videos

Also Read: Kondapalli municipality: కొండపల్లి చైర్‌ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ.. ప్రత్యేక బస్సులో టీడీపీ కౌన్సిలర్లు

ఈ ఎన్నికలో ఎక్స్ అఫీషియోలు కూడా ఓటు వేయవచ్చు. ఇందులోనూ టీడీపీ, వైసీపీకి సమాన బలం ఉన్నది. ఎక్స్‌అఫీషియోగా టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని, వైసీపీ నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. హోరాహోరీగా ఉన్న ఈ ఎన్నికపై ఇరు పార్టీలు ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉభయ పార్టీల మధ్య చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలోనే కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారుల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గొల్లపూడి నుంచి టీడీపీ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బస్సుకు రక్షణగా భారీ ర్యాలీగా టీడీపీ శ్రేణులు బయలుదేరారు. కౌన్సిలర్లతో పాటు బస్సులో కేశినేని నాని, దేవినేని ఉమ ఉన్నారు. అంతకు ముందు వీరిద్దరు కౌన్సిలర్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Also Read: AP Municipal Election Results 2021: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ ఖాతాలో దర్శి..ఫైనల్ రిజల్ట్స్ ఇవే

అయితే కోరం ఉంటేనే నేడు చైర్ పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. చైర్ పర్సన్ ఎన్నిక చేపట్టాలంటే 16 మంది సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సమస్యేమీ రాకున్నా.. తాజాగా వైసీపీ కార్యకర్తలు కేశినేని నానిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. ఒక్క ఉదుటను కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ కలెక్టర్ వెల్లడించినట్టు తెలిసింది.

click me!