బలహీనవర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ నేత నందం సుబ్బారావు అలియాస్ సుబ్బయ్య హత్య స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే జరిగిందని... అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బలహీనవర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతూ... బలహీనవర్గాల నాయకుడిగా, న్యాయవాదిగా ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను, ఇళ్లపట్టాల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే సుబ్బయ్య హత్య గావించబడ్డాడన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ బీసీలను అణగదొక్కే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. బలహీనవర్గాలకు నామమాత్రపు పదవులిస్తూ, తనవర్గాన్నిమాత్రం జగన్ అందలం ఎక్కిస్తున్నాడన్నారు.
undefined
రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట హత్యో, అత్యాచారమో, మరో దారుణమో జరుగుతూనే ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిత్యం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉందన్నారు. నందం సుబ్బయ్య హత్యను టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా మచ్చుకైనా కనిపించడ లేదని రవీంద్ర వాపోయారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం, ప్రశ్నించే గళాలను అణిచివేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోందన్నారు. బలహీనవర్గాలు టీడీపీపక్షాన ఉన్నారన్న అక్కసుతోనే ప్రభుత్వం ఆయావర్గాలపై కత్తికట్టిందన్నారు. చేనేతవర్గానికి చెందిన సుబ్బయ్య నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో అతన్ని బలితీసుకున్నారన్నారు.
సుబ్బయ్య హత్యకు కారణమైన స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేసి, విచారించి అతనిపై తగినచర్యలు తీసుకోవాలన్నారు. బలహీనవర్గాలను అణచివేయాలని చూస్తున్న జగన్, అందుకు తగిన మూల్యం చెల్లించుకొని తీరుతాడని రవీంద్ర హెచ్చరించారు.