ఇప్పటంలో కేఏ పాల్‌ను మించి పవన్ హడావిడి.. గులకరాయితో కొడితే పోవడానికి చంద్రబాబు ఏమైనా పావురమా?: కొడాలి నాని

By Sumanth KanukulaFirst Published Nov 5, 2022, 4:47 PM IST
Highlights

తెలుగుదేశం, జనసేన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాజకీయంగా దిగజారుడు పనులు  చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలుగుదేశం, జనసేన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాజకీయంగా దిగజారుడు పనులు  చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తాగుబోతులు గొడవ చేస్తే పవన్ కల్యాణ్‌పై రెక్కీ చేశారని జనసేన ఆరోపిస్తుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తనపై తానే గులకరాళ్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. గులకరాయితో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందట అని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు రాష్ట్రంలో లేని సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మీద లేని పోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 

గులకరాయి పెట్టి కొడితే పోవడానికి చంద్రబాబు ఏమైనా పావురమా? పిట్టనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై దాడి చేసే అవసరం ఎవరికీ లేదన్నారు.  చంద్రబాబు బాదుడే బాదుడే అని పనికిమాలిన కార్యక్రమం మొదలుపెట్టాడని విమర్శించారు. బాదుడే బాదుడే అంటే.. చంద్రబాబును బాదమన్నాడేమోనని ఎవడో రాయి తీసుకొని కొట్టినట్టుగా సెటైర్లు వేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మతి  ఉండే మాట్లాడుతున్నాడా అని విమర్శించారు. మోదీని చూస్తేనే చంద్రబాబుకు భయం అని ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా ఒక్క సలహా అయినా ఇచ్చాయా అని ప్రశ్నించారు. 

మునుగోడు ఉప ఎన్నికలు కేఏ పాల్ ఎంటర్‌టైన్‌మెంట్ పవన్‌కు నచ్చినట్టుగా ఉందని.. అందుకే ఇప్పటం వచ్చి సేమ్ ఊరుకులు, పరుగులు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటంలో కేఏ పాల్‌ను మించి హడావిడి చేయాలని పవన్ ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. ఇప్పటంలో అరుపులు, కేకలు పెట్టాడని.. షో అయిపోయాక రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పొలిటికల్ టూరిస్ట్ అని విమర్శించారు. 

హైవేలు కేంద్ర ప్రభుత్వం వేస్తుందని.. ఇడుపులపాయలో హైవే వేయడానికి పవన్ కల్యాణ్ ప్రధాని అవ్వాలని  అన్నారు. ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం కేఏ పాల్, పవన్ కల్యాణ్‌లు పోటీ పడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, కేఏ పాల్.. ఒకరు ప్రధాని, ఒకరు ప్రతిపక్ష నాయకుడు అవుదామని అనుకుంటున్నారా అంటూ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌ ప్రధానిమంత్రి అయ్యాక ఇడుపులపాయలోనే కాకుండా గుడివాడలో కూడా హైవే వేసుకోవచ్చని అన్నారు. 

click me!