
గుడివాడ : గుడివాడ కొత్త పురపాలక శాఖ కార్యాలయం ఎదుట ఉన్న ఎమ్మెల్యే కొడాలి నాని ఫోటో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు పురపాలక శాఖ ద్వారం వద్ద ఆయన నిలువెత్తు ఫొటోను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫొటో అక్కడే ఉంది. నాని ఫోటో తొలగించక పోవడంపై మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ బుధవారం ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంచాలని, ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫొటోలను వారం రోజుల్లో తొలగించాలని లేనిపక్షంలో ధర్నా చేయడానికైనా సిద్ధమేనని ఆయన కమిషనర్ కు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఆగస్ట్ 22న బీజేపీ నేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ బేటీ మీద కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. ఏ ఉపయోగం లేకుంటే ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ లో అమిత్ షా భేటీ అయ్యారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని.. తానూ భావిస్తున్నట్టుగా కొడాలి నాని తెలిపారు.
‘‘జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. కాబట్టే.. ఆయనను కలిస్తే దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని కలిశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏ ప్రయోజనం లేకపోవడంతోనే మోదీ, అమిత్ షాలు ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు’’ అని కొడాలి నాని అన్నారు.