ఈనాడు అధినేత రామోజీరావును బహిరంగంగా ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు కీలక విషయాలను ప్రస్తవించారు.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు కీలక విషయాలను ప్రస్తవించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదనా? లేదా ఇంకెప్పటికీ అధికారంలోకి రాడన్న ఆక్రోశమా? లేక మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల్ని చట్టబద్ధంగా ప్రశ్నించారన్న తట్టుకోలేనితనమా"? అసలు మీ బాధేంటని రామోజీ రావును కొడాలి నాని ప్రశ్నించారు.
ఈనాడు పత్రికలో పవన్ కల్యాణ్ తమ్ముడిలా.. సీఎం జగన్ ను మాత్రం ఏకవచనంతో సంబోధించి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. పత్రికా విలువలను పాటించడం లేదనీ, ఎన్టీఆర్ వెన్నుపోటునాడే హారతిపళ్ళెంలో పెట్టి చంద్రబాబుకు సమర్పించేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మానవతా విలువల్నింటిని అదే పద్ధతిలో వదిలేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వారం బెంగుళూరులో భవన నిర్మాణ కార్మికులు కారు యాక్సిడెంట్ లో చనిపోతే.. కారు యాక్సిడెంట్ లో చనిపోవడం ఘోరమా..? లేక బెంగుళూరు వెళ్ళటం ఘోరమా..? అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రం వారు, మరో రాష్ట్రానికి పనుల కోసం వెళ్లడం సహజమని, గత ప్రభుత్వ హయంలో కూడా ఇలా ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్లారని అన్నారు.
వాస్తవానికి ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజూ కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారని, అలాగే ఒడిశా నుంచి ఉత్తరాంధ్రకు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు, ఛత్తీస్ గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు కూడా వలస వస్తారని ఉదాహరించారు. ఇలాంటి సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగితే.. ఉపాధి లేమీతో ముడిపట్టి..పెద్ద హెడ్డింగ్ పెట్టి వార్తలు రాయడం దారుణమన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళలో కరవు మండలాలు ప్రకటించాల్సిన అవసరం లేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదనీ, ఏటా కరవేనని అన్నారు. ఒక్క 2016నే రాయలసీమ నుంచి దాదాపు 6 నుంచి 10 లక్షల మంది వ్యవసాయం మానివేసి.. వలసపోయారని, ఈ విషయాన్ని ఏ తెలుగు పత్రికలు కవర్ చేయలేనీ, కానీ, అప్పట్లో ఇంగ్లీష్ పత్రికలు ఈ విషయాన్ని ఎత్తి చూపాయని గుర్తు చేశారు.
అలాగే.. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో 29 మంది చనిపోతే.. ఆ విషయాన్ని ఎందుకు కవర్ చేయలేనీ, ఆరోజు అది బాబు చేసిన ఘోరం కాదా అని రామోజీరావును కొడాలి ప్రశ్నించారు. నేటికి చంద్రబాబును అటువంటి దుర్మార్గాలను వెనకేసుకొచ్చి, దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్టపరిహారాన్ని అందించారని అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం మీద, మానవతాసాయం విషయంలో ఏమాత్రం వెనకాడని ఆయనపై గిట్టనివాడు కాబట్టి రాళ్ళు వేస్తున్నారు. మరీ ఇంత దుర్మార్గమా"? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.