ఏపీలో కియా మరిన్ని పెట్టుబడులు: సీఈవో ప్రకటన, చంద్రబాబుపై జగన్ సెటైర్లు

By telugu teamFirst Published May 28, 2020, 2:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ సీఈవో ప్రకటన చేశారు. కియా మోటార్స్ ప్లాంట్ తరలిపోతుందంటూ చంద్రబాబు ప్రచారం చేసి గందరగోళం సృష్టించారని జగన్ అన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని కియా మోటార్స్ సీఈవో కూక్యూన్ షిమ్ తెలిపారు. ఏపీలో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన మన పాలన - మీ సూచన కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెపిపారు. కియా ఎస్ యూవీ వెహికల్స్ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కియాకు మంచి సంబంధం ఉందని చెప్పారు. 

ఇదిలావుంటే, ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కియా రాష్ట్రం నుంచి వెళ్లిపోతుందని చంద్రబాబు ప్రచారం చేశారని ఆయన అన్నారు. అది విని కియా ఎందుకు వెళ్లిపోతుందంటూ తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన తెలిపారు. నెగెటివ్ మాజీ ముఖ్యమంత్రికి తోడు నెగెటివ్ మీడియా ఉందని ఆయన అన్నారు. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించింది. 

చివరకు కియా మోటార్స్ ఎండీ వచ్చి తాము ప్లాంటును ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించడం లేదని చెప్పారని ఆయన అన్నారు. తాము తరలిపోవడం లేదని కియా చెప్పడం అభినందనీయమని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నిపుణుడు అని ఆయన అన్నారు. 

ఎల్జీ పాలిమర్స్ విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరించామని, తొందరగా స్పందించామని ఆయన చెప్పారు. ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీక్ కావడం దురదృష్టకరమైన సంఘటన  అని ఆయన అన్నారు. బహుళజాతి సంస్థ కంపెనీలో అటువంటిది జరగకూడదని, కానీ దురృదృష్టవశాత్తు సంభవించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఆయన అన్నారు. 

సంఘటనపై తాము దూకుడుగా అనాలోచిత చర్యలు తీసుకుంటే పారిశ్రామి వర్గాల్లో గందరగోళం ఏర్పడుతుందని, అందుకని జాగ్రత్తగా వ్యవహరించామని ఆయన చెప్పారు. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరుపుతున్నాయని ఆయన చెప్పారు. ఘటన జరిగిన పది  రోజుల్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించామని ఆయన చెప్పారు. 

click me!