శాశ్వతంగా అధికారంలో ఉందామనుకున్నా: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published May 28, 2020, 1:49 PM IST
Highlights

టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను శాశ్వతంగా అధికారంలో ఉందామని అనుకున్నానని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండలేరని చంద్రబాబు అన్నారు.

అమరావతి: తాను శాశ్వతంగా అధికారంలో ఉందామని అనుకున్నానని, అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నానని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలీపై, పోలీసుల తీరుపై మండిపడుతూ ఆయన గురువారం మహానాడులో ఆ వ్యాఖ్యలు చేశారు. 

పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండలేరని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతసేపు అని ఆయన అన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పోలీసులను మాత్రమే తాను అంటున్నానని, అందరినీ అనడం లేదని ఆయన అన్నారు. పోలీసులు అడుగడుగునా టీడీపీని ఏడాది కాలంగా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. 

రాజకీయాలు తమాషా కాదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ దయాదాక్షిణ్యాల మీద టీడీపీ పనిచేయాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ మారాలని ఆయన అన్నారు. తప్పుడు పనులు చేసిన పోలీసులను మాత్రమే అంటున్నట్లు ఆయన తెలిపారు. చాలా మంది డీజీపీలను చూశానని, ఈ తరహా డిజీపీని చూడలేదని ఆయన గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి అన్నారు. రంగనాయకమ్మ వ్యవహారమే డీజీపీ లొంగిపోయారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను లాఫింగ్ స్టాక్ చేశారని, జగన్ అరాచకాలు చేస్తే ఆటలు సాగవని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. మనపై బురద చల్లేవారే బురదలో కూరుకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎవరికీ భయపడదని, సవాళ్లు తమకు కొత్త కాదని, టీడీపీని ఎవరూ కదిలించలేరని ఆయన అన్నారు. 

వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని, హత్యా రాజకీయాలు తమకు అలవాటు లేదని ఆయన అన్నారు .డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ తీరు దుర్మార్గమని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 

click me!