రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

By Nagaraju TFirst Published Jan 21, 2019, 8:07 AM IST
Highlights

విజయవాడకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాధా రాజీనామాతో కృష్ణా జిల్లాలో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. రాధా రాజీనామాతో ఇతర పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. 

గుంటూరు: విజయవాడకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాధా రాజీనామాతో కృష్ణా జిల్లాలో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. రాధా రాజీనామాతో ఇతర పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. 

రాధాను తమ పార్టీలోకి రావాలంటే తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం అయితే ఏకంగా ఎమ్మెల్సీ ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. రాధా రాజీనామాతో అలర్ట్ అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలను గుర్తించే పనిలో పడింది. 

ఇకపై ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. అయితే గుంటూరు జిల్లాలో వైసీపీకి చెందిన సీనియర్ నేత ఆ పార్టీని వీడతారని ఆయన కూడా రాధా బాటలో నడుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

దీంతో అప్రమత్తమైన వైసీపీ పార్టీసీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లను రంగంలోకి దింపింది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు గతకొంతకాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

వైసీపీని వీడుతారని తెలుసుకున్న అధిష్టానం జిల్లాకు చెందిన సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. ఆదివారం సాయంత్రం గుంటూరు చేరుకున్న సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లు నేరుగా కావటి మనోహర్ నాయుడు నివాసానికి వెళ్లారు. సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు. 

కావటి అలకపై ఆరా తీశారు. ఇక అసలు విషయానికి వస్తే పెదకూరపాడు నియోజకవర్గ బాధ్యతలను అధిష్టానం శంకర్‌ రావుకు అప్పగించినప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత నాలుగేళ్ళుగా పెదకూరపాడు సమన్వయకర్తగా పని చేసిన తనను కాదని ఇప్పుడువేరొకరి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

శంకర్ రావును సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఆయన అనుచరులు, కార్యకర్తలు అభిమానులు పార్టీ మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. విషయం తెలుసుకున్న అధిష్టానం బుజ్జగింపులకు దిగింది. 

అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని కావటి రాయబారానికి వచ్చిన నేతల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తాను పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీచెయ్యాలని నాలుగేళ్లుగా ఎంతో వ్యయప్రయాసలు పడుతుంటే ఇప్పుడు ఆ నియోజకవర్గ బాధ్యతలను వేరొకరికి అప్పగించడం సబబు కాదని నిలదీశారు. 

ఆ స్థానం కాకపోతే మరో సీట్ అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కావటితో సీనియర్ల బుజ్జగింపులు ఏమేర  సక్సెస్ అవుతాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆయన పార్టీ పెద్దల బుజ్జగింపుతో మెత్తబడతారా లేక రాధాలా రాజీనామా చేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. 

click me!