
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విశాఖలో జరిగిన పరిణామాలతో పాటు మంగళగిరిలో ఆయన ప్రెస్ మీట్, ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీతో రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదే సమయంలో తనకు బీజేపీ నుంచి సరైన మద్ధతు లభించడం లేదని, రోడ్ మ్యాప్ అడిగినా పట్టించుకోవడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కమల దళంలో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే ఏపీ బీజేపీలో సోము వీర్రాజుపై గుర్రుగా వున్న కొందరు నేతలు ఆయనను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిలో భాగంగా సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ తో వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని... జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి దాపరించిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. మరి దీనిపై సోము వీర్రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read:మోదీ అంటే గౌరవం.. అలా అని నా స్థాయిని నేను చంపుకోను: బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు..
ఇకపోతే.. నిన్న పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీతో పొత్తు గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుంది. దాడులపై గవర్నర్ దగ్గరు తమ టీమ్‌ను పంపుతామని చెప్పారు. బీజేపీని రోడ్డు మ్యాప్ అడుగడమేమిటని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ‘‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడా బలంగా పనిచేయలేకపోయాం. అది బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలుసు. మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. పవన్ కల్యాణ్ పదవి కోసమైతే ఇంత ఆరాట పడడు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే.. ముందుగా అభివృద్ది కోసమే పనిచేస్తానని చెప్పారు.