‘‘నిధులు కావాలన్నా.. పథకాలు దక్కాలన్నా ‘పచ్చ’ కండువా ఉంటేనే’’

By sivanagaprasad kodatiFirst Published Sep 30, 2018, 4:19 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కన్నా హాజరయ్యారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కన్నా హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని... చంద్రబాబుది అన్నం పెట్టే చేయినే నరికే నైజమని.. కేంద్రాన్ని కూడా అలాగే మోసం చేశారని విమర్శించారు. పచ్చ కండువా కప్పుకున్న వారికే నిధులు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు.

రాజధాని భూములతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు విడుదల చేసిందని.. కానీ నాలుగేళ్లలో నాలుగు భవనాలు కూడా నిర్మించలేదన్నారు.. అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

రాజధాని కోసం ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ఏమయ్యాయో తెలపాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు వల్లే కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఆలస్యమవుతున్నాయని.. డిజైన్ల మార్పు పేరుతో పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌లు బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి కారణం.. వారి అసమర్థ పాలనేనని మాధవ్ విమర్శించారు.
 

click me!