
ఈఎస్ఐ స్కాంలో శుక్రవారం ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన అరెస్ట్ ని ఆంద్రప్రదేశ్ బీజేపీ సమర్థించింది. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదే విషయంపై బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబేనన్నారు. ప్రతి పక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీసీలందరూ బయటకు వచ్చి నిరసన తెలపాలని ఆయన మాట్లాడటం దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈఎస్‌ఐ స్కాం విషయంలో ప్రధానిమంత్రి మీద కూడా అచ్చెన్నాయుడు గతంలో బురద చల్లారని గుర్తుచేశారు.
ఈఎస్‌ఐ స్కాంలో ప్రధాని పేరు ప్రస్తావిస్తే సహించేది లేదన్నారు. అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడుని ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారని లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు