కడప అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

By Aithagoni Raju  |  First Published Jun 4, 2024, 9:04 AM IST

కడప నిజయోకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజాద్‌ భాషా, టీడీపీ నుంచి మాధవి రెడ్డి ఎన్నికల బరీలో ఉన్నారు. వీరిలో ఎవరిది విజయం అనేది కాసేపట్లో తేలనుంది. 
 


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రమైనా, నవ్యాంధ్ర అయినా కడప చుట్టూనే తిరుగుతాయి. దేశానికి, రాష్ట్రానికి ఉద్ధండులైన నేతలను అందించింది ఈ గడ్డ. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంపై సీఎం జగన్ దృష్టి సారించారు. పులివెందుల, కడప జగన్ ఫ్యామిలీకి రెండు కళ్లలాంటివన్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అందుకే రాజకీయాల్లో , పాలనలో ఎంత బిజీగా వున్నా ఈ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యులను నియమించి ఎప్పటికప్పుడు ఓ కన్నేసి వుంచుతారు జగన్. 

1952లో కడప నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత కడపలో జగన్ పార్టీ ఓడిపోలేదు. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెడ్డి, ముస్లిం మైనారిటీ, దళిత వర్గాలు కడపలో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీలు అత్యధికంగా 8 సార్లు విజయం సాధించారంటే వారికి ఇక్కడనున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు.

Latest Videos

1994 నుంచి నేటి వరకు కడపలో అన్ని పార్టీలు ముస్లింలకే టికెట్‌ను కేటాయిస్తూ వస్తుండగా వారే గెలుస్తున్నారు. కడప నుంచి అంజాద్ భాషా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో భాషా గెలుపొందారు. కడప శాసనసభ నియోజకవర్గంలో 2,65,154 మంది ఓటర్లున్నారు. కడప నగరం మొత్తం ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. 2019  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అంజాద్ భాషాకు 1,04,822 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అమీర్ బాబుకు 50,028 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 54,794 ఓట్ల తేడాతో కడపను దక్కించుకుంది. 

కడప శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 

కడపను నిలబెట్టుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు సీఎం జగన్‌. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ భాషానే ఎన్నికల బరిలోకి దించారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ వర్గాల్లో వున్న పలుకుబడి, నగరాభివృద్ధి కార్యక్రమాలు, జగన్ ఛరిష్మా తనను మరోసారి గెలిపిస్తాయని అంజాద్ భాషా గట్టి ధీమాతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే .. ఆ పార్టీ ఇక్కడ గెలిచి పాతికేళ్లు అవుతోంది. 1999లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో విజయం సాధించింది.  కానీ ఈసారి ఎలాగైనా కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు భావించారు. ఈసారి మాత్రం చంద్రబాబు ప్రయోగం చేసి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాధవీ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు. మరి వైసీపీ, టీడీపీ ఇద్దరిలో ఎవరిది విజయం అనేది మరి కాసేపట్లో తేలనుంది. 
 

click me!