అంతర్వేదిలో రూ. 2.60 లక్షలు పలికిన కచిడి మగ చేప.. ఆ చేపకు అంతా డిమాండ్ ఎందుకంటే..?

By team teluguFirst Published Oct 31, 2021, 3:10 PM IST
Highlights

అంతర్వేది సాగర సంగమం వద్ద స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లగా 21 కిలోల కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీన్ని గోల్డ్ ఫిష్‌గా పిలుస్తారు. దానిని శనివారం పల్లిపాలెం చేపల మార్కెట్‌కు తరలించారు. అక్కడ ఈ చేప రూ. 2.60 లక్షలకు అమ్ముడు పోయింది. 

సాధారణంగా మత్స్యకారులు నదులు, సముద్రాలు మీద ఆధారపడి ఉపాధి పొందుతారు. అక్కడ దొరికే చేపలను అమ్ముకుని జీవనం సాగిస్తారు. అయితే సాధారణంగా చేపల ధరలు తక్కువగానే ఉంటాయి. ఒకవేళ పులస చేప అయితే రూ. 4 వేలకు పైగా ధర పలుకుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేదిలో అప్పుడుప్పుడు కొన్ని రకాలు చేపలు మత్స్యకారుల పంట పండిస్తున్నాయి. అలాంటి వాటిలో గోల్డ్ ఫిష్ కూడా ఒకటి. ఇది ఎవరూ ఊహించని విధంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటాయి. తాజాగా 21 కిలోల బరువుగల కచిడి మగ చేప (kachidi male fish) రూ. 2.60 లక్షలు పలికింది. 

వివరాలు.. అంతర్వేది సాగర సంగమం వద్ద స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లగా 21 కిలోల కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీన్ని గోల్డ్ ఫిష్‌గా పిలుస్తారు. దానిని శనివారం పల్లిపాలెం చేపల మార్కెట్‌కు తరలించారు. అక్కడ ఈ చేప రూ. 2.60 లక్షలకు అమ్ముడు పోయింది. దీంతో మత్స్యకారులు జాక్‌పాట్ దక్కింది. అయితే ఈ మధ్య కాలంలో ఇంత భారీ చేప లభించడం ఇదే మొదటిసారి అని మత్స్యకారులు తెలిపారు. స్థానిక పాటదారుడు ఒకరు ఈ చేపను కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపను బయటి ప్రాంతానికి ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. 

అయితే ఈ చేప ఇంత అధిక ధర పలకడానికి.. దానిలో ఔషధ గుణాలుండడమే కారణంగా తెలుస్తోంది. కచిడి రకం చేపల్లో ఆడ చేప కంటే మగ చేపకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఇప్పుడు భారీ ధర పలికిన చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తుంటారు. శస్త్ర చికిత్స చేసే సమయంలో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్‌బ్లాడర్‌ను వాడుతుంటారు. అందుకే దీనిని అంత ధర చెల్లించి సొంతం చేసుకన్నారని స్థానిక మత్స్యకారులు తెలిపారు. 

గతంలో కూడా కచిడి చేపలు భారీగా ధరలు పలికిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఆ ప్రాంతంలో తెగ వైరల్‌గా మారింది. ఆ చేపకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

click me!