
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul) తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాననీ, కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయత్రం విశాఖపట్నంలోని డా .కె.ఏ. ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కేఏ పాల్ మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అవసరం అయిన మూలధనం 4 వేల కోట్లు అమెరికా వెళ్లి సమకుర్చానని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ..జూన్ 4 వరకూ సమయం ఇచ్చానని ఆయన అన్నారు. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుందనీ, కుటుంబ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామన్న విషయాన్ని తెలుగు ప్రజలకు తెలియాలని, జూన్ 4 లోపల అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్ష దిగుతానని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తన ప్రతిపాదనకు అనుకూలంగా స్పందిస్తే 72 గంటల్లో 4 వేల కోట్ల వైట్ మనీని చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఒకవేళ మాట తప్పితే తన పాస్ పోర్ట్ సీజ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ 4 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ థర్డ్ ఫేస్ రన్ చేయవచ్చనీ, ఇది16 వేల కుటుంబాలకు శుభవార్త అని అన్నారు.
కాపు, బీసీ, ఎస్సీలు అందరూ కలిసిరావాలనీీీ, తెలుగు వాడిగా పుట్టినందుకు తాను గర్విస్తున్నని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జేడీ లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని, గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నారని చెప్పుకోచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తన పార్టీ ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని స్థానాల్లోను తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఇదే సందర్బంగా మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరమన్నారు. పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. జనసేన నుంచి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక్కో అభ్యర్థికి అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు.