
మద్రాసు హైకోర్టు (Madras High Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ (Justice Chandru) గురించి కొన్ని నెలల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదనే చెప్పాలి. సూర్య నటించిన జై భీమ్ చిత్రంతో (jai bheem movie) ఆయనను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ఎందుకంటే జై భీమ్ చిత్రాన్ని ఆయన నిజ జీవితం ఘటనలను స్పూర్తిగా తీసుకుని నిర్మించారు. అయితే తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) పని తీరుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు మనకు కావాలని అన్న చంద్రూ.. మనం ఇప్పుడు ఏపీలో ఏం చూస్తున్నామని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థకు పరిమితులు ఉంటాయని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ పౌర హక్కుల సంఘం, కుల విపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అమరావతి భూముల విషయంలో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని జస్టిస్ చంద్రూ అన్నారు. కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రూ అన్నారు. ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.. వారిని తప్పించమని కోరింది. కానీ ప్రభుత్వం వాదనను కోర్టు పట్టించుకోలేదు.. మామూలుగా అయితే బెంచ్ మారుస్తారని ఆయనఅభిప్రాయపడ్డారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం ఆ నిర్ణయానికి కారణలేమిటో అర్థం చేసుకోవాలని అన్నారు.
హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ యొక్క ఉదాహరణను ప్రస్తావించిన జస్టిస్ చంద్రూ.. నిర్దేశించిన సమయంలోగా రిప్లై ఫైల్ చేయకుంటే.. జరిమానా విధించవచ్చని జస్టిస్ చంద్రూ అన్నారు. మానవ హక్కుల కేసులో తమిళనాడు ప్రభుత్వం సమాధానం ఇవ్వనందున గత నెలలో సుప్రీంకోర్టు రూ. 1 లక్షను జరిమానా విధించిందని అన్నారు. కానీ ఏపీ హైకోర్టు జడ్జీలు మాత్రం ప్రెసిండెట్ రూల్ విధిస్తామని చెబుతున్నారని.. ఆ వ్యాఖ్యలు చేయడానికి జడ్జిలు ఎవరని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో జడ్జిల పై వచ్చిన వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.. మరో ఇద్దరిని అరెస్ట్ చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామని రిటైర్డ్ జస్టిస్ చంద్రూ అన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా పెడితే సీబీఐ విచారణ చేపిస్తున్న హైకోర్టు.. భూ వివాదాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే క్వాష్ చేస్తుందని అన్నారు. మనం ఎక్కడికి పోతున్నామని ప్రశ్నించారు.