నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.. నారాయణ జూనియర్‌ కాలేజీకి రూ.5 లక్షల జరిమానా  

By Rajesh Karampoori  |  First Published Nov 3, 2022, 10:17 AM IST

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రైవేటు జూనియర్‌ కళాశాల యాజమాన్యాన్ని అనంతపురం  జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరించారు. నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో రూ.5 లక్షలు జరిమానా విధించారు. 


ఇంటర్‌బోర్డు నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం
జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలోని సోములదొడ్డి లో బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ కళాశాలకు రూ.5 లక్షల జరిమానా విధించారు. 

జిల్లా పర్యవేక్షణ కమిటీ (డిస్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ) చైర్మన్ జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో సభ్యులు నారాయణ జూనియర్ కళాశాలలో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నిర్ణీత సమయం కంటే.. ఎక్కువ సమయం వరకు తరగతులు నిర్వహిస్తున్నారని,విద్యార్థులకు క్రీడ సదుపాయలను కల్పించడం లేదని అధికారులు గుర్తించారు.  అలాగే.. హాస్టల్ లో సరైన తాగునీటి సరఫరా, వేడినీరు అందించడం లేదని విద్యార్థులు కమిటీ దృష్టికి తెచ్చారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనీ, తమను బాధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. అలాగే.. విద్యార్థులకు నాసికరమైన భోజనం అందిస్తున్నారని కమిటీ గుర్తించింది. 

Tap to resize

Latest Videos

దీంతో కళాశాల యాజమాన్యం తీరుపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతినెలా 2 కళాశాలల్లో ఈ కమిటీ  పర్యటిస్తుందని, విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, డీవీఈవో వెంకటరమణనాయక్‌, డీఈఓ శామ్యూల్‌, ఆరైవో సురేష్‌బాబు, సైక్రియాటిస్ట్‌ రవికుమార్‌, స్త్రీ,శిశు సంక్షేమశాఖ పీడీ శ్రీదేవి, ఫుడ్‌ఇన్‌స్పెక్టరు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

click me!